వీలునామా రద్దుకూ ఆధారాలుండాలి-ఆస్తిపై హక్కులుంటే పత్రాలు చూపాల్సిందేనన్న హైకోర్టు

వీలునామా రద్దుకూ ఆధారాలుండాలి-ఆస్తిపై హక్కులుంటే పత్రాలు చూపాల్సిందేనన్న హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: వీలునామా ద్వారా ఆస్తులు ఇతరులకు బదలాయించినప్పుడు దాన్ని రద్దు చేసినట్లు చెప్పే వారే అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆస్తిపై తమకు హక్కులు ఉన్నాయంటూ వాదనలు చేయడం మాత్రమే సరిపోదని, యాజమాన్యాన్ని నిరూపించే పత్రాలు తప్పనిసరిగా చూపాలని పేర్కొంది.

జగిత్యాల జిల్లా మెట్​పల్లి పట్టణంలోని ఆస్తికి సంబంధించి 1999లో సీనియర్‌‌‌‌‌‌‌‌ సివిల్‌‌‌‌‌‌‌‌ జడ్జి కోర్టు ఇచ్చిన తీర్పుపై చంద్రమ్మ, ఆమె దత్తపుత్రుడు దాఖలు చేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌ను హైకోర్టు విచారించింది. చంద్రమ్మ స్త్రీధనంతో సంపాదించిన ఆస్తులను ఆమె భర్త లక్ష్మారెడ్డి వీలునామా ద్వారా ట్రస్టుకు కేటాయించడం చెల్లదని, ఆ తర్వాత ఆ వీలునామాను రద్దు చేశారని పిటిషనర్లు వాదించారు.

అయితే వీలునామా ఆధారంగానే చట్ట ప్రకారం ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు వివరించారు. ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక అంశాలను ప్రస్తావించింది. ఆస్తి స్వాధీన ప్రక్రియలో విధానపరమైన లోపాలున్నా, పిటిషనర్లు తమ యాజమాన్య హక్కులను నిరూపించే ఆధారాలు చూపలేదని పేర్కొంది.

వీలునామా రద్దుకు సంబంధించిన రిజిస్ట్రేషన్‌‌‌‌‌‌‌‌ పత్రాలు లేవని, అవి కుటుంబ ఆస్తులని నిరూపించే ఆధారాలు కూడా సమర్పించలేదని తెలిపింది. ఈ కారణాలతో కింది కోర్టు తీర్పును మార్చాల్సిన అవసరం లేదంటూ పిటిషన్‌‌‌‌‌‌‌‌ను కొట్టివేసింది.